వించెస్టర్: ఓ మహిళ పామును చూసి భయపడిపోయింది. అంతే.. అదెక్కడ ఇంట్లోకి చొరబడుతుందేమోనన్న భయంతో గదిలోనే రెండురోజులపాటు ఉండిపోయింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని హ్యాంప్‌షైర్‌లో జరిగింది. హ్యాంప్‌షైర్‌కు చెందిన ఓ మహిళకు తన ఇంటి ఎదురుగా ఉన్న హాల్‌లో పాము కనబడింది. దీంతో ఆమె గుండెలదిరిపోయాయి. ఇక గది నుంచి అడుగు బయటకు వేసే ధైర్యం చేయలేక ఇంటికి తాళం వేసుకుని లోపలే ఉండిపోయింది. కానీ తర్వాతి రోజు కూడా పాము అక్కడ నుంచి కదల్లేదు. ఆ పాములో చలనమే లేకపోయే సరికి ఆమెకు ఎంతకూ అంతు చిక్కలేదు. అప్పటికే సమాచారమందుకున్న జంతు సంరక్షణాధికారులు ఆ ఇంటిని చేరుకుని దాన్ని గమనించగా అది ఉత్తి రబ్బర్ పామేనని తేల్చారు.
ఎవరో కావాలనే ఆమెను ప్రాంక్ చేసేందుకు ప్రయత్నించారని అభిప్రాయపడ్డారు. కానీ పాపం, సదరు మహిళ అది నిజమేనని అనుకుని గదిలో రెండురోజులపాటు తనని తానే నిర్భందించుకుంది. ఇక పదిరోజు క్రితం కూడా అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెండు పాములు ఉరేసుకుని చనిపోయాయని అధికారులకు సమాచారం అందింది. వెంటనే వాళ్లు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అవి బొమ్మ పాములని తేల్చారు. వెంటనే చెట్టు నుంచి ఆ రబ్బరు పాములను తీసేసి దూరంగా పారేశారు. ఈ విషయాన్ని అధికారులు ట్విటర్ ద్వారా వెల్లడించడంలో సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. పిచ్చి పిచ్చి ప్రాంక్‌లతో జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.